Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడితో (Mumbai Blasts) భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. 10 మంది ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ
దాడికి కీలక సూత్రధారుల్లో ఒకడిగా భావిస్తున్న తహవ్వుర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) పలు కేసుల్లో అమెరికా గతంలోనే అరెస్టు చేసింది. అయితే, ముంబయి దాడి కేసులో విచారించేందుకు గాను అతడిని
భారత్‌కు తీసువచ్చేందుకు దాదాపు 14ఏళ్లు పట్టింది. బాల్య స్నేహితులు.. 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి రాణా చిన్ననాటి స్నేహితుడు. హెడ్లీ
తండ్రి పాక్ దౌత్యవేత్త కాగా తల్లి అమెరికా దేశస్థురాలు. బాల్యంలో పాకిస్థాన్‌లో గడిపిన హెడ్లీ, రాణా చదివిన సైనిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం అమెరికా వెళ్లినప్పటికీ పాక్ ఉగ్రసంస్థతో హెడ్లీ
సంబంధాలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే బిజినెస్ కన్సల్టెంట్‌గా భారత్‌లో పలుమార్లు పర్యటించాడు. ఇతడికి తన ఇమిగ్రేషన్ సంస్థ తరఫున తహవ్వుర్ సాయం చేసినట్లు సమాచారం. ఎఫ్‌బీఐకి చిక్కి.. ముంబయి
దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేతికి రాణా చిక్కాడు. లష్కర్-ఏ-తొయిబా (LeT)తోపాటు డెన్మార్క్ వార్తా పత్రిక కార్యాలయాలపై దాడికి కుట్ర పన్నాడనే
అభియోగాలపై షికాగోలో అతడిని అరెస్టు చేశారు. అనంతరం లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉంచారు. * అప్పుడు కసబ్‌ని గన్‌తో కాల్చేద్దామనుకున్నా.. దావూద్, హఫీజ్
లాంటోళ్లని ఉరితీయాలి: దేవిక ఉగ్రదాడికి సంబంధించి ముంబయి పోలీసులు 2009లో వేసిన తొలి ఛార్జిషీటులో రాణా పేరు లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2011లో వేసిన ఛార్జిషీట్‌లో మాత్రం తొలిసారి
అతడి పేరును పేర్కొంది. ఈ దాడికి ప్రధాన కుట్రదారుల్లో రాణాను ఒకడిగా తెలిపిన ఎన్‌ఐఏ.. 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి రవాణా పరంగా,
ఆర్థికంగా ఎలా సాయం చేశాడనే వివరాలను స్పష్టంగా వెల్లడించింది. దాడికి రెండేళ్ల ముందే లక్షిత ప్రదేశాల్లో హెడ్లీ రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. దౌత్య ప్రయత్నాలు.. రాణాను తీసుకువచ్చేందుకు
దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టిన భారత్.. అతడిని అప్పగించాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి 2019లో లేఖ రాసింది. అనంతరం అతడి అరెస్టు వారెంటును కోరుతూ 2020లో అభ్యర్థించగా కాలిఫోర్నియా కోర్టు
అందుకు అనుమతించింది. అయితే, ఇప్పటికే ఒకేవిధమైన ఆరోపణలపై రెండుసార్లు ఎలా విచారిస్తారంటూ రాణా తరఫు న్యాయవాదులు వాదించారు. అయినప్పటికీ వారి వాదనను కోర్టు తోసిపుచ్చింది. అప్పటి అధ్యక్షుడు జో
బైడెన్ కూడా భారత్‌కు రాణాను అప్పగించేందుకు అంగీకరించారు. అడ్డుకునేందుకు పిటిషన్లు భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక న్యాయస్థానాల్లో రాణా అనేక పిటిషన్లు దాఖలు చేశాడు. ఈ క్రమంలో
శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీల్ కోర్టు.. అప్పగింతపై ఆదేశాలు ఇవ్వడంతో చివరకు నవంబర్ 2024లో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ రివ్యూ పిటిషన్‌ను ఈ ఏడాది జనవరి 21న అమెరికా సర్వోన్నత న్యాయస్థానం
కూడా తోసిపుచ్చడంతో భారత్‌కు అప్పగించడం అనివార్యమైంది. మోదీ అమెరికా పర్యటనకు ముందు రోజు (ఫిబ్రవరి 11న) ఇదే అంశంపై మాట్లాడిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రాణాను భారత్‌కు అప్పగించే విషయాన్ని
అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆరోగ్య కారణాలను చూపుతూ అప్పగింతను నిలిపివేయాలని జిల్లా కోర్టులు సహా సుప్రీంను ఆశ్రయించినప్పటికీ అవి తిరస్కరణకు గురికావడంతో భారత్ విమానం ఎక్కడం
అనివార్యమైంది.