Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదాన్ని సహించేదే లేదన్నది మోదీ ప్రభుత్వ విధానమని, ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ దీనికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. భారత
సరిహద్దులను, సైన్యాన్ని, పౌరులను సవాలు చేసే వారికి ఈ సైనిక చర్యే తగిన సమాధానమని చెప్పారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం అణచివేత విషయంలో ప్రపంచానికి బలమైన సందేశాన్ని చేరవేశామన్నారు. ‘ఆపరేషన్
సిందూర్’ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంపై ప్రధాని
మోదీని, త్రివిధ దళాలను సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు అభినందించారని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో భాగంగా దేశ అంతర్గత భద్రత పరిస్థితులనూ కేంద్ర మంత్రి అమిత్ షా
సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భద్రతాసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, పకడ్బందీ నిఘా ఉంచాలని ఆదేశించినట్లు తెలిపాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్,
ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ల లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒమర్ అబ్దుల్లా అత్యవసర సమావేశం.. ఉగ్ర
సంస్థలపై భారత సైన్యం ఆపరేషన్ అనంతరం నియంత్రణ రేఖ (LoC) వెంట పాకిస్థాన్ రేంజర్లు భీకర కాల్పులకు తెగబడ్డారు. సామాన్య పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న
పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌరుల రక్షణ, మౌలిక సదుపాయాల పెంపు, ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమన్వయంతో
ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.