Play all audios:
Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించొచ్చా అని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ప్రశ్నించారు. దిల్లీ: శాసనసభలు ఒకటికి రెండుసార్లు
ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో
ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి
నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న
ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు
తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. * యుద్ధ
విమానాలు నడుపుతున్నారుగా… మహిళలకు ఆ ఉద్యోగాలు ఎందుకివ్వరు? రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే.. * రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత
అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? * సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? * రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా
నిర్దేశిస్తాయి? * రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? * ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్
రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? ఏంటీ తీర్పు.. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది
ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో
చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే
సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు
ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.