Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: భారత అభ్యర్థన నేపథ్యంలో ముంబయి పేలుళ్ల కేసు (Mumbai terror attacks) కుట్రదారుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా అప్పగించింది. ఈ నేపథ్యంలో మరో కీలక సూత్రధారి
డేవిడ్ హెడ్లీ (David Headley)ని ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అతడిని భారత్‌కు తీసుకురావడం సాధ్యం కాదని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ముంబయి దాడులకు ముందు ఆ
కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు రాణాను అమెరికా ప్రభుత్వం భారత్‌కు
అప్పగించింది. కానీ హెడ్లీని అప్పగించేందుకు అమెరికా సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. తనను భారత్, పాక్,
డెన్మార్క్‌కు అప్పగించవద్దని 2010లోనే యూఎస్ అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. ఇది చట్టపరమైన ఒప్పందమని, రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా
అతడికి మరణ శిక్ష తప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముంబయి దాడుల్లో ప్రమేయం, లష్కరే తొయిబా, పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాల గురించి అతడు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు కీలకంగా
మారాడు. * భారత్‌కు తహవ్వుర్ రాణా.. సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు ఇప్పుడు అతడిని అప్పగించడం వల్ల నిఘా కార్యకలాపాలు, ప్రస్తుతం విచారణలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు
చెప్పాయి. యూఎస్ ఏజెన్సీలైన ఎఫ్‌బీఐ వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయి. అతడు గతంలో వాటికి ఇన్‌ఫార్మర్‌గా పనిచేశాడని ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే ముంబయి దాడి గురించి ముందుగానే యూఎస్ నిఘా
సంస్థ దృష్టికి వచ్చిందని, అయితే దానిని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీకైన ప్రతాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించడం వల్ల నిఘా సమాచారాన్ని సేకరించే
విధానాలు, ఉగ్రవాది-ఇన్‌ఫార్మర్‌గా హెడ్లీ వ్యవహారం బయటపడవచ్చని పేర్కొన్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం అతడికి మరణశిక్ష విధించకూడదు. అయితే అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదుల విషయంలో కఠినవైఖరి
అనుసరించిన భారత్ ఈ షరతును అంగీకరించలేదని నిఘా వర్గాలు తెలిపాయి. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. రాణా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ
పరిచయమయ్యాడు. ముంబయి ఉగ్రదాడికి ముందు రాణాతో పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ (David Headley) టచ్‌లో ఉండేవాడని ఎన్‌ఐఏ తెలిపినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వెల్లడించింది. 26/11 దాడికి
ముందు ఎనిమిది సార్లు హెడ్లీ భారత్‌కు వచ్చాడని.. ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని తెలిపింది. దాడులకు ముందు 2006, సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్‌కు వచ్చి రెక్కీ
నిర్వహించాడని.. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్లు పేర్కొంది. హెడ్లీ భారత్‌కు వచ్చినప్పుడల్లా.. ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు.. ఇలా చాలాసార్లు మాట్లాడినట్లు
తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్‌ఐఏ పత్రాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని పేర్కొంది.