Play all audios:
(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్డెస్క్: ఆపదలో చిక్కుకున్న కన్నకొడుకును చూసి తట్టుకోలేకపోయాడో తండ్రి. తన బిడ్డను కాపాడుకోగలనా..? అన్న భయం అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తీవ్ర ఆందోళనకు గురై
చివరకు తన ప్రాణాలే కోల్పోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Son Stuck In Elevator) మధ్యప్రదేశ్ (Madhya
Pradesh) రాజధాని భోపాల్లో జత్కేడీ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో రిషిరాజ్ భట్నాగర్ (51) తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. సోమవారం రాత్రి తన కుమారుడిని వెతుక్కుంటూ ఇంటి నుంచి
కిందికి వచ్చారు. అతడు కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పాడు. దాంతో ఆ పిల్లాడు ఎలివేటర్ ఎక్కగా.. పవర్ కట్ అయింది. తన బిడ్డ అందులో ఇరుక్కుపోయాడని రిషిరాజ్ భయపడిపోయాడు. తీవ్ర ఆందోళనకు
గురికావడంతో గుండెపోటు (Heart Attack)కు గురయ్యాడు. కొన్ని నిమిషాల్లో పవర్ రావడంలో ఆ ఎనిమిదేళ్ల పిల్లాడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ ఆలోపే ఆ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పడిపోయిన
రిషిరాజ్ను చూసి, అపార్ట్మెంట్ వాసులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. అతడు గుండెపోటుకు గురయ్యాడని,
పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి విషయాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మూడు నిమిషాల్లో పవర్ రావడంతో పిల్లాడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాడని, పూర్తి క్షేమంగా ఉన్నాడని వెల్లడించారు. సోమవారం
రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.