Play all audios:
దర్భంగా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ (PM Modi) కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వెనుకబడిన
వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఇక్కడికి
రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని అన్నారు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి వచ్చానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బిహార్‌లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ
ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథిలా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికారపార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు.
యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను. బిహార్ ప్రభుత్వం నన్ను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా? మీ అందరి అభిమానమే
నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోదీని గద్దె దించుతుంది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకే కులగణను మోదీ అంగీకరించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. ఎన్డీయే
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా...అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్ విమర్శించారు. కేవలం 5శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు,
ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్ వ్యక్తులకే మోదీ గవర్నమెంట్ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన
చేపట్టాలని, ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు
వంచైనా వీటిని సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘ఫులె’ చిత్రాన్ని వీక్షించిన రాహుల్ బిహార్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పట్నాలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లారు.
మహాత్మా జ్యోతిబా ఫులె, సావిత్రిబాయి ఫులెల జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫులె’ చిత్రాన్ని వీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, సామాజిక వేత్తలు
రాహుల్‌తో కలిసి సినిమా చూశారు.