Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ స్ట్రైక్స్ గురించి ప్రధాని సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ
గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్ సిందూర్’ను అభివర్ణించారని సమాచారం (Operation Sindoor). పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు
ఉగ్రశిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని
నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీకి
ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత
ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్
డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్
(Security Advisor Ajit Doval) మాట్లాడారు.