Play all audios:
ఓ చిన్న పాయింట్‌ని ఆధారంగా చేసుకుని ఆసక్తికరంగా సినిమాలు తెరకెక్కించగలరని మలయాళ దర్శకులకు పేరుంది. బ్లాక్ కామెడీ జానర్‌లో రూపొందిన ‘మరణమాస్’ (Maranamass) అలాంటిదే. బసిల్ జోసెఫ్ (Basil
Joseph), రాజేశ్ మాధవన్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. శివ ప్రసాద్ దర్శకుడు. ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేసిన ఈ మలయాళ మూవీ ప్రస్తుతం ఓటీటీ ‘సోనీలివ్’
(SonyLIV)లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ‘మరణమాస్’ కథాంశమేంటి? (Maranamass Review) కేరళలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధులను ఓ సీరియల్ కిల్లర్ (రాజేశ్ మాధవన్) హత్యలు చేస్తుంటాడు.
మర్డర్ చేసిన అనంతరం శవం నోట్లో అరటిపండు పెట్టడం అతడి స్టైల్. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బసిల్ జోసెఫ్) ప్రవర్తన భిన్నంగా ఉండడంతో అతడే ఆ మర్డర్లు చేశాడని అందరూ అనుకుంటారు. గ్రామస్థుల
మాటలు నమ్మిన ల్యూక్ ప్రేయసి జెస్సీ (అనిష్మ) అతడిని దూరం పెడుతుంది. ఓసారి బస్సులో ప్రయాణిస్తుండగా జెస్సీతో ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపోద్రిక్తురాలైన
జెస్సీ అతడిపై పెప్పర్ స్ప్రే వినియోగిస్తుంది. ఊహించని రీతిలో ఆ వృద్ధ ప్రయాణికుడు మరణిస్తాడు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియకుండా మేనేజ్ చేయాలని బస్సు డ్రైవర్, కండక్టర్, చివరకు మిగిలిన
ప్రయాణికుడు శ్రీకుమార్‌కి విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్లాన్‌లో తాము ఉండగా.. బ్రేకప్ విషయంలో జెస్సీని నిలదీసేందుకు ఆమె ఆచూకీ వెతుక్కుని మరీ ల్యూక్ అదే బస్సు ఎక్కుతాడు. మరి, ఆ మర్డర్ గురించి
ల్యూక్ పోలీసులకు చెప్పాడా? జెస్సీకి సాయం చేశాడా? అసలైన సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన డీఎస్పీ అజయ్ రామచంద్రన్ (బాబూ ఆంటోనీ) కేసును ఛేదించాడా (Maranamass Story)? *
రివ్యూ: అనగనగా.. సుమంత్ ఎమోషనల్ డ్రామా మెప్పించిందా? క్రైమ్ అంశాలతో ముడిపడిన వినోదాత్మక చిత్రమిది. ప్రయాణికుడు మరణించాడన్న విషయం బయటకు రాకుండా ఐదుగురు వ్యక్తులు చేసిన నవ్వుల సాహసం.
సీరియల్ కిల్లర్ నుంచి పోలీస్ ఆఫీసర్ వరకూ ప్రతి పాత్ర ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో సాగుతుంది. సీరియల్ కిల్లర్- డీఎస్పీల పరిచయం, ల్యూక్- జెస్సీల ప్రేమ, తండ్రిని పోగొట్టుకున్న
బస్సు కండక్టర్ దుఃఖం, బస్సు డ్రైవర్ పెళ్లి ప్రస్తావన.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలను బస్సులో వృద్ధుడి మరణానికి లింక్ చేయడం థ్రిల్ పంచుతుంది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు
జెస్సీ ప్రాథేయపడడం, డ్రైవర్, కండక్టర్‌తోపాటు శ్రీకుమార్ అందుకు అంగీకరించడం, అదే సమయంలో ల్యూక్ వెళ్లడం.. ఇలా ప్రతి సీన్ సరదాగా సాగిపోతుంది. శ్రీకుమార్ కోణంలో మంచి ట్విస్టు ఎదురవుతుంది.
కండక్టర్ వైపు నుంచి తండ్రి సెంటిమెంట్‌నూ పండించారు. మరోవైపు, వీళ్లు పోలీసుల కంట పడతారేమోనన్న ఉత్కంఠ రేకెత్తించేలా స్క్రీన్‌ప్లే నడిపారు (Maranamass Review In Telugu). ఓ శ్మశానం
బ్యాక్‌డ్రాప్ సీక్వెన్స్ నవ్వుల ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుపడింది. కథకు సంబంధంలేని ఎపిసోడ్‌లా అనిపిస్తుంది. అక్కడ తాము అనుకున్న పని పూర్తి కాకపోవడంతో ఆ గ్యాంగ్ శవాన్ని తీసుకుని
మళ్లీ బస్సెక్కడంతో స్టోరీ మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ల్యూక్- శ్రీకుమార్‌ల మధ్య సాగే పోరాటం అంతగా ఆకట్టుకోదు. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా సినిమా ముగింపు ఉంటుంది.
చివరిలోనూ ఓ ట్విస్ట్‌తోనూ నవ్వులు పంచేలా ప్రయత్నం చేశారు. కథను కామెడీ కోణంలోనే చెప్పినా.. అంతర్లీనంగా సందేశాన్నీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అమ్మాయిల ఆత్మరక్షణలాంటి అంశాలు
ఆలోచింపజేస్తాయి. నటులంతా ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన్’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బసిల్ జోసెఫ్ ఇందులో విభిన్న గెటప్పులో ఆకట్టుకుంటారు.
ఆయన హెయిర్‌స్టైల్ ప్రధాన ఆకర్షణ. * కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమానే ఇది. అసభ్యకర సన్నివేశాలు, సంభాషణల్లేవు. రక్తపాతం విషయంలోనూ దర్శకుడు పరిధి దాటలేదు. నిడివి:
2గంటలుపైగా. * చివరిగా: ఇది ‘మాస్’ కాదు ఫుల్ కామెడీ బాస్ (Maranamass Review)! * గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!