Play all audios:
Anna University | ఇంటర్నెట్‌డెస్క్: అన్నా యూనివర్శిటీలో గతేడాది డిసెంబర్ 23న 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన జ్ఞానశేఖరన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.90,000
అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు చెన్నైలోని మహిళా కోర్టు తీర్పును వెలువరించింది. నిందితుడు కనీసం 30 ఏళ్ల పాటు కారాగారంలో ఉండాల్సిందేనని న్యాయమూర్తి ఎం.రాజ్యలక్ష్మి తన తీర్పులో
తేల్చిచెప్పారు. అతడిపై ఎటువంటి దయా చూపకూడదని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణలో మొత్తం 29 మంది సాక్షులను విచారించారు. ఇక జ్ఞానశేఖరన్‌కు వ్యతిరేకంగా పోలీసులు 100 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు
చేశారు. అతడిపై నమోదైన 11 నేరాలు రుజువయ్యాయి. దీంతో నిందితుడు శిక్షను వీలైనంత తగ్గించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తాను కుటుంబంతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని కోర్టును వేడుకొన్నాడు.
తనకు వృద్ధురాలైన తల్లి, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నట్లు పేర్కొన్నాడు. కానీ, న్యాయమూర్తి అతడి అభ్యర్థనను తోసిపుచ్చి.. వీలైనంత ఎక్కువ శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 23న
రాత్రి అన్నావర్సిటీ ప్రాంగణంలో కూర్చొని ఉన్న విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. బాధిత విద్యార్థిని
ఫిర్యాదు మేరకు కొట్టూర్‌పురం ఆల్ ఉమెన్ పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొట్టూర్‌పురానికి చెందిన
జ్ఞానశేఖరన్‌ను డిసెంబరు 26న అరెస్టు చేశారు. అతడు పక్కనే బిర్యానీ దుకాణం నడిపేవాడని గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో అతను కింద పడటంతో చేతులు, కాళ్లు విరిగినట్లు పోలీసులు
తెలిపారు.