Play all audios:
అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌డెస్క్: భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఏ క్షిపణీ
ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్’ (Golden Dome) అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణానికి అమెరికా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని నిర్మాణంలో భాగం
కావడానికి కెనడా (Canada) ఆసక్తి చూపుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే పేర్కొన్నారు. దీనిపై తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) స్పందించారు. గోల్డెన్
డోమ్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ‘అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్‌డోమ్‌లో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నాం. ఇది కెనడా పౌరుల రక్షణకు మంచి ఆలోచన. భవిష్యత్తులో కెనడా
లక్ష్యంగా అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల ముప్పును ఇది సమర్థంగా ఎదుర్కొంటుంది. దీనిపై ట్రంప్‌తో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపేందుకు చూస్తున్నాం. మేము స్వయంగా ఈ డోమ్‌ను నిర్మించుకోవాలా? లేక
అమెరికాతో భాగం కావాలా అనే దానిపైనా ఆలోచన చేస్తున్నాం’ అని కార్నీ పేర్కొన్నారు. * ఇక అంతరిక్షంలో యుద్ధాలు! ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహాలో అమెరికా ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థను
ఏర్పాటుచేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇక అమెరికా అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్
వెల్లడించారు. తన పదవీకాలం ముగిసేలోపు ఇది పూర్తవుతోందన్నారు. ప్రపంచంలోని ఏవైపు నుంచి క్షిపణి ప్రయోగించినా, అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం దీనికి ఉందని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల మనుగడకు ఇది ఎంతో ముఖ్యమైన ముందడుగన్నారు. అయితే దీని నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15లక్షల కోట్లు) ఖర్చవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. 542 బిలియన్ డాలర్ల వ్యయం
అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డెన్‌డోమ్ నిర్మాణాన్ని చైనా, రష్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని, అంతరిక్షాన్ని యుద్ధ
క్షేత్రంగా మార్చేస్తుందని పేర్కొంటున్నాయి.