Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తైవాన్ (Taiwan) ఒక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ చియా-లుంగ్ (Lin Chia-lung) అన్నారు. ప్రపంచ దేశాలన్నీ తమను ఒక దేశంగా
పరిగణిస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకుంటున్న తమ దేశాన్ని చైనా తమ సొంత భూభాగంగా చూస్తోందని..దానిని నిరూపించుకోవడానికి తమపై సైనిక, రాజకీయ ఒత్తిడిని
పెంచుతోందని ఆయన అన్నారు. తరచూ తమను బెదిరించడానికి యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తూ..బీజింగ్ విపరీత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చైనాతో అనేకసార్లు చర్చలు
జరపడానికి ముందుకొచ్చినప్పటికీ ఆ దేశం అందుకు తిరస్కరించిందని పేర్కొన్నారు. తమది శాంతికాముక దేశమని..ఇప్పటికీ తాము చైనాతో స్నేహపూర్వక బంధాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తైవాన్
విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ తైవాన్ ఎప్పటికీ చైనాకు చెందిన భూభాగమే అని స్పష్టం చేసింది. తైవాన్ తమ దేశంలో భాగమని బీజింగ్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇటీవల తైవాన్‌పై బీజింగ్
తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచ దేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది. గతేడాది మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తె ఎన్నికైన
తర్వాత ఆ దేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటివరకు మూడుసార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్
ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ‘‘ తైవాన్ స్వాతంత్ర్యానికి మేము మద్దతు ఇవ్వం’’ అని అమెరికా విదేశాంగ శాఖ వెబ్సైట్లో ఉన్న స్టేట్మెంట్ను ఆ దేశం తొలగించడంతో అగ్రరాజ్యంపై చైనా
తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో బీజింగ్ విదేశాంగశాఖ అగ్రరాజ్యంపై మండిపడింది. డ్రాగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.