Play all audios:
అమెరికాపై చైనా ప్రకటించిన అదనపు సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA), చైనా (China)ల మధ్య వాణిజ్య
యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై
భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఏప్రిల్ 8లోగా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేదంటే ఏప్రిల్ 9 నుంచే 50 శాతం ప్రతీకార సుంకాలు
విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి చెప్పారు. * అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్ గుప్పిట్లోకి S&P 500 ‘‘అమెరికాపై చైనా 34 శాతం అదనపు సుంకాలను
ప్రకటించింది. ఆ దేశం ఇప్పటికే పెద్దఎత్తున టారిఫ్‌లు విధిస్తోంది. కంపెనీలకు అక్రమ రాయితీలు, దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది. నేను హెచ్చరించినప్పటికీ.. అదనపు సుంకాల ద్వారా
అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొలుత ప్రకటించిన దానికంటే పెద్దఎత్తున విధిస్తాం. అందువల్ల.. ఏప్రిల్ 8 నాటికి చైనా తన
34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే.. ఏప్రిల్ 9 నుంచే ఆ దేశంపై 50% అదనపు టారిఫ్‌లు విధిస్తాం. ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం’’ అని సామాజిక మాధ్యమాల వేదికగా
ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు ట్రంప్ చైనాపై 34% ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్ సైతం దీటుగా స్పందించింది. రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన
16 సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు
ప్రకటించింది. దీంతోపాటు ప్రతీకార సుంకాలపై ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ (డబ్ల్యూటీవో)లో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ విషయంలో ఇప్పటికే బీజింగ్ తీరును తప్పుపట్టిన ట్రంప్.. తాజాగా ప్రతీకార సుంకాలను
మరింత పెంచుతానంటూ స్పష్టం చేశారు.