Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మన సిలిగుడి కారిడార్(చికెన్స్ నెక్) విషయంలో బంగ్లా అనుసరిస్తోన్న
విధానాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. ఈ కారిడార్‌కు కేవలం 100 కి.మీ. దూరంలో ఉన్న లాల్‌మోనిర్హాత్ ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించేందుకు బంగ్లాదేశ్‌కు చైనా సహాయం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.
వాటిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ‘‘ మన దగ్గర చికెన్స్ నెక్ ఉంది. కానీ బంగ్లాదేశ్ వద్ద రెండు చికెన్స్ నెక్‌లు ఉన్నాయి. మనదానిపై దాడిచేస్తే.. మనం రెండింటిపై చేస్తాం. ’’ అని వ్యాఖ్యలు
చేశారు. అలాగే మన సైన్యం పరాక్రమాన్ని హిమంత బంగ్లాకు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వసం చేసిన విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తావించారు. మనపై దాడి
చేయాలంటే బంగ్లా 14 జన్మలు ఎత్తాలని విమర్శించారు. ఈశాన్య భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు సిలిగుడి కారిడార్ నుంచి వెళతాయి. దీంతోపాటు కీలక పైప్‌లైన్లు,
కమ్యూనికేషన్ కేబుల్స్‌కు ఇదే మార్గం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్ , భూటాన్, బంగ్లాదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన
చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే
ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డొక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కొన్ని
నెలల క్రితం చైనా పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య
రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాజాగా హిమంత ప్రస్తావించిన చికెన్స్ నెక్‌లు..
బంగ్లాదేశ్‌కు చెందిన అతిపెద్ద పోర్ట్ సిటీ చిట్టగాంగ్ నుంచి ఆ దేశ ప్రధాన భూభాగాన్ని కలుపుతున్నది ఒకటి. మేఘాలయ -పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పుర్ మధ్యలో ఉన్న రంగపుర్ కారిడార్ రెండవది అని
తెలుస్తోంది.