Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీటిపై నటుడు క్షమాపణ చెప్పాలని కన్నడిగుల నుంచి డిమాండ్లు వస్తున్న వేళ కమల్
స్పందించారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. అయితే, భాష
గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు. ‘‘ప్రేమతో నేను అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో
మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ప్రతిఒక్కరిని మిళితం చేసుకునే తత్వం ఉంటుంది. ఓ ‘మేనన్’ (ఎంజీ రామచంద్రన్) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ ‘రెడ్డి’ (ఒమందూర్ రామసామి రెడ్డియార్) సీఎం
అయ్యారు. మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు
ఎక్కడికి వెళ్లొద్దు.. మేం ఆశ్రయం కల్పిస్తాం అన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా దానిపై మాట్లాడే అర్హత వారికి లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు
శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్ పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించడం
తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా కర్ణాటక భాజపా నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, ఆ విషయాలన్నీ కమల్‌కు తెలియకపోవచ్చని ఆ
వ్యాఖ్యలను తిప్పికొట్టారు.