Play all audios:
UK Education: ‘బ్రిటన్‌లో చదువులపై మీరేమంటారు?’ శీర్షికన ఈనాడు.నెట్ ప్రచురించిన కథనానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు!. యూకేలో చదువుల విషయంలో తర్జనభర్జన పడుతున్న
విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. Image credit: University of Oxford website UK Education | ఇంటర్నెట్ డెస్క్: యూకేలో ఇటీవల కాలంలో జీవన వ్యయం బాగా పెరిగిపోయిందని పలువురు
బ్రిటన్‌లో నివాసం ఉంటున్న తెలుగు వారు పేర్కొంటున్నారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా తగ్గాయని చెబుతున్నారు. స్థోమత ఉండే వారు నిరభ్యంతరంగా రావొచ్చని, అయితే, టాప్
వర్సిటీలకే పెద్దపీట వేయాలని సూచిస్తున్నారు. కొందరు విద్యార్థులు చదువులపై కాకుండా డబ్బు సంపాదించడంపై దృష్టి పెడుతున్నారని, ఇది వారి నైపుణ్యాభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని పలువురు ఆందోళన
వ్యక్తంచేశారు. ప్రత్యామ్నాయంగా భారత్‌లో పెరుగుతున్న అవకాశాలను కూడా గమనంలో పెట్టుకోవాలని ఇంకొందరు సూచిస్తున్నారు. భారత్‌లోనే మంచి సంస్థల్లో చదువుకుని, అక్కడే అవకాశాలను అందిపుచ్చుకోవడం మంచిదని
సలహా ఇస్తున్నారు. * US Education: పార్ట్ టైమ్ ఆలోచనొద్దు.. చదువులకోసమైతేనే రండి! ‘బ్రిటన్‌లో చదువులపై మీరేమంటారు?’ శీర్షికన ఈనాడు.నెట్ ప్రచురించిన కథనానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు
స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు!. యూకేలో చదువుల విషయంలో తర్జనభర్జన పడుతున్న విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పాఠకులకు ఒకచోట అందిస్తున్నాం.
ప్రచురణలో ఉన్న ఇబ్బందుల రీత్యా పరిమిత సంఖ్యలోనే వారి పేర్లు ప్రస్తావిస్తున్నాం. పేర్లు ప్రచురించనప్పటికీ వారందరి అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నాం. ఎన్నారైల సమాధానాలివీ.. * ప్రస్తుత
జీవన వ్యయం, పార్ట్‌టైమ్ ఉద్యోగావకాశాలను పరిగణనలోకి తీసుకుంటే మాస్టర్స్ కోసం యూకేకు రావడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. భారత్‌లో స్థితిమంతులైతే యూకేలో మాస్టర్స్ డిగ్రీ కోసం
ప్లాన్ చేసుకోవచ్చు. - మధుబాబు * టెక్నాలజీ, ఏఐ, మెడిసిన్ వంటి భవిష్యత్తు అవకాశాలు ఉన్న రంగాల్లో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో మీరు అడ్మిషన్ పొందినట్లయితే యూకేకి రావడం మంచిది.
చదువుతున్నప్పుడు సొంత నిధులు సమకూర్చుకోవడం ఉత్తమం. - విజయ్ * ఉద్యోగ అవకాశాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు పెద్దగా లేవు. మీరు ఎంచుకున్న రంగంలో ముందస్తు అనుభవం లేకుండా రావాలనుకోవద్దు.
కన్సల్టెన్సీలు చెప్పేవి కాకుండా వర్సిటీల గురించి సొంతంగా అధ్యయనం చేయండి. - కుమార్ * బ్రిటన్‌లో అత్యున్నత కళాశాలల్లో చదివిన వారికే అవకాశాలు ఉన్నాయి. గడిచిన పదేళ్లలో ఖర్చులు విపరీతంగా
పెరిగాయి. - ప్రసాద్ కడియాల * యూకేలో భారతీయ విద్యార్థులకు అనుకూల పరిస్థితులు లేవు. నిరుద్యోగ సమస్య ఉంది. ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులూ పెరిగాయి. ఇక్కడి ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది.
మన దేశంలో ఉండి కూడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు అందించే ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకోవచ్చు. - రాజేశ్వరరెడ్డి * నేనైతే ఉన్నత చదువుల కోసం యూకేకి రావొద్దని చెబుతా. జీవన వ్యయం ఖరీదు, పార్ట్
టైమ్ ఉద్యోగాల కొరత, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, అధిక విశ్వవిద్యాలయ రుసుములే ఇందుక్కారణం. ఇక్కడి కంటే భారత్‌లోనే పరిస్థితులు మెరుగు. - రవితేజ * యూకేలో ఉద్యోగావకాశాలు తగ్గాయి. జ్ఞానం
సంపాదించడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి మీరు రావాలనుకునేవారికి స్వాగతం. మంచి విశ్వవిద్యాలయాలు ఉన్న అనేక నగరాల్లో నివసించడం కూడా చాలా ఖరీదైనదని గుర్తుంచుకోండి. - శ్రీనాథ్ * వేగంగా
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. యూకేలో చదువుకోవాలంటే సంబంధిత రంగంలో పని అనుభవం పొందడం ముఖ్యం. ఉద్యోగావకాశాలు
అంతంతమాత్రంగానే ఉంటాయనే దానికి మానసికంగా సిద్ధమై రావడం మంచిది. - కిశోర్ * కొవిడ్ తర్వాత బ్రిటన్‌కు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు. చాలా మంది తక్కువ
ఖర్చుతో కూడిన విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. సంబంధం లేని లేదా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు చేస్తుండడంతో స్పాన్సర్‌షిప్ పొందలేకపోతున్నారు. AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి
రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధిక డిమాండ్ ఉన్న రంగాలు ఎంచుకోవడం మంచిది. మంచి విశ్వవిద్యాలయాలను ఎంచుకోండి. - పీఎల్‌ఎన్ నాయుడు * కోర్సు, జీవన వ్యయాలకు తగినంత డబ్బు ఉన్నవారు యూకే రావడం
మంచిది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేద్దామన్న ఆలోచనలు వద్దు.- విజయ్ * తెలివైన, కష్టపడి పనిచేసే విద్యార్థులకు బ్రిటిష్ విద్య చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వర్సిటీల గురించి సొంతంగా అధ్యయనం చేయండి.
పార్ట్ టైమ్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా.. చదువు, వ్యక్తిగత ఖర్చులకు పూర్తిగా నిధులు మీరే సమకూర్చుకోండి. - చంద్ర సీపాన * బ్రిటన్‌లో విద్య పరిశ్రమల్లో ఉండే సవాళ్లకు పరిష్కారం చూపేవిధంగా, ఉపాధి
అవకాశాలను సొంతం చేసుకునేలా ఉంటుంది. ఎంఎస్ చేయడానికి వచ్చే విద్యార్థులు ఉద్యోగ సాధనలో నిరంతరం కృషి చేస్తే విజయం సాధిస్తారు. - విద్యా సాగర్ * యూకేలో ఉన్నత విద్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
పొందింది. ఇక్కడ మాస్టర్స్ కోర్సులు ఏడాదిలో పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం, ఖర్చు పరంగా లాభదాయకం. చదువుల సమయంలో విద్యార్థులు వారానికి 20 గంటల వరకు పార్ట్‌టైమ్ పని చేయొచ్చు. చదువు తర్వాత
పీఎస్‌డబ్ల్యూ వీసా ద్వారా యూకేలో ఉద్యోగం చేయవచ్చు. మంచి ఉద్యోగం పొందాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్‌వర్కింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. - వెంకటేశ్వరరావు * తెలుగు రాష్ట్రాల నుంచి
యూకేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, విద్యార్థులు వర్సిటీల ర్యాంకింగ్‌లతో పాటు జీవన వ్యయం, పార్ట్‌టైమ్ పని అవకాశాలు, పోస్ట్-స్టడీ కెరీర్ అవకాశాలు వంటి
ఆచరణాత్మక అంశాలపై కూడా దృష్టి పెడితే మంచిది. - శ్రీనివాస్ * ఇక్కడ ఉన్నత చదువుల కోసం లక్షల రూపాయలు వెచ్చించే బదులు భారత్‌లోనే మెరుగైన నైపుణ్యాలు సంపాదించి ఇక్కడ ఉపాధి అవకాశాల వెతుక్కోవడం
మంచిది. - రాజేష్ మరికొన్ని సంక్షిప్తంగా.. * యూకేలో మంచి విశ్వ విద్యాలయాలను ఎంపిక చేసుకోండి. * చదువులపై దృష్టిపెట్టేవారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. * చాలా మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను
అభివృద్ధి చేసుకోవడం కంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే యూకేకి వస్తున్నారు. * ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలనూ పరిశీలించొచ్చు.