Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత్‌తో దూరం జరిగేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మహమ్మద్ యూనస్ సలహాలతో పనిచేసే ప్రభుత్వం న్యూదిల్లీకి వ్యతిరేకంగా పలు చర్యలు
చేపట్టింది. తాజాగా మరో నిర్ణయం వీటికి తోడైంది. సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం కోల్‌కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్
షిప్‌బిల్డర్స్-ఇంజినీర్స్(జీఆర్‌ఎస్‌ఈ)తో ఉన్న ఓ ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. దీని విలువ రూ.180.25 కోట్లు. జీఆర్‌ఎస్‌ఈ రక్షణశాఖ కింద పని చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఈ ఒప్పందం రద్దు
విషయాన్ని స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. ‘‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ మాకు ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసుకొంది’’ అని ఈ-ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ టగ్ బోట్లు ఓడలను నెట్టడానికి,
సాల్వేజ్ ఆపరేషన్లకు వినియోగిస్తారు. ఇటీవల కాలంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు చైనాతో సంబంధాలు బలపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయన నిర్ణయాలు తరచూ భారత్‌కు వ్యతిరేకంగా
వెలువడుతున్నాయి. దీనికితోడు చైనా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూభాగంతో మూసుకుపోయాయని.. ఈ ప్రాంతాలకు సముద్రంతో అనుసంధానించేందుకు ఢాకానే దిక్కని వివాదాస్పద
వ్యాఖ్యలు చేశారు. దీనికితోడు ఆయన కార్యవర్గంలోని వారు తరచూ భారత్‌లోని ఈ రాష్ట్రాలపై ప్రకటనలు చేస్తున్నారు. ఈ చర్యలు భారత్‌తో దూరాన్ని పెంచుతున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల భారత్ ప్రతిచర్యలకు
దిగింది. బంగ్లాదేశ్ సరకును మన దేశం మీద నుంచి రవాణాకు ఉన్న అన్ని అనుమతులను రద్దు చేసింది.